రేపు తెలంగాణ బంద్.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అరెస్ట్

Adilabad

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని, నేను నియంతను, నేనే రాజును అంటే కుదరదని కార్మిక సంఘాల నేతలు ముప్పేట దాడి చేస్తున్నారు.

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. హైకోర్టు సూచనలను అటు కార్మిక సంఘాలు, ఇటు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో పరిస్థితి అలాగే ఉంది. మరోవైపు, ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనలను మరింత తీవ్రతరం చేశారు. అక్టోబరు 19న తలపెట్టిన తెలంగాణ బంద్‌కు పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక సంఘాలు ఇప్పటికే మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ అధ్యర్యంలో శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహిస్తుండగా కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డిని సుందరయ్య విజ్ఞానభవన్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆయనతోపాటు ఆర్టీసీ జేఏసీ సహ కన్వీనర్‌ రాజిరెడ్డి, వెంకన్నలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి, కార్మికులతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలను ఆయన కోరారు. సమ్మె విషయంలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోరాటం కొనసాగిస్తామని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వంపై అశ్వత్థామరెడ్డి గురువారం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తన ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఆర్టీసీ సమ్మె విషయంలో మేధావుల మౌనం మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కార్మికులందరూ ఉద్యమించి తెలంగాణను సాధించుకున్నామని అన్నారు. ప్రస్తుత సీఎం, నాటి ఉద్యమ నేత కేసీఆర్‌కు మేము వెన్నంటి ఉన్నామని, ఆ స్ఫూర్తితోనే కొట్లాడి ఆర్టీసీని కాపాడుకుంటామని ఆయన పేర్కొన్నారు.

అంతకుముందు సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షుడు పద్మనాభన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల కోసం కార్మిక లోకమంతా ఉద్యమం చేయడం శుభ పరిణామమని అన్నారు. గతంలో కేంద్ర కార్మిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సీఎం కేసీఆర్‌కు కార్మిక చట్టాల గురించి తెలియకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ‘సెల్ఫ్ డిస్మిస్’ అనే పదం రాజ్యాంగంలో లేదని పద్మనాభన్ గుర్తు చేశారు. ఉద్యమం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ఆర్టీసీ ఉద్యమాన్ని అణచివేస్తానంటే ఎలా? అని ఆయన నిలదీశారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights