కరోనా వ్యాక్సిన్‌ రవాణాకు:GMR

Spread the love

*కరోనా వ్యాక్సిన్‌ రవాణాకు*

*విస్తృత ఏర్పాట్లు*

*ఉష్ణోగ్రతల నిర్వహణకు ప్రత్యేక* *సదుపాయాలు*

*జీఎంఆర్‌ కార్గోలో సరికొత్త*

*పరికరాలు* కొవిడ్‌ వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులో రానున్న తరుణంలో.. మన దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాలకు రవాణా చేసేందుకు హైదరాబాద్‌ విమానాశ్రయం సంసిద్ధమైంది. కరోనా వ్యాక్సిన్‌ తయారీలో హైదరాబాద్‌ కీలకంగా మారనుంది. నగరానికి చెందిన భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి-తయారీలో నిమగ్నమవ్వగా, బయోలాజికల్‌ ఇ, డాక్టర్‌ రెడ్డీస్‌, హెటిరో సంస్థలు కూడా టీకాల ఉత్పత్తిలో భాగస్వాములుగా మారనున్నాయి. వివిధ దేశాల్లో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లను సైతం హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీల ద్వారా ఉత్పత్తి చేసి పలు దేశాలకు సరఫరా చేయనున్నారు. వ్యాక్సిన్‌ రవాణాలో శీతల ఉష్ణోగ్రతలు నిర్వహించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌కార్గో (జీహెచ్‌ఏసీ) వ్యాక్సిన్‌ నిల్వ, రవాణాకు అవసరమైన వసతులు సమకూర్చుకుంటోంది. ఇప్పటికే విమానాశ్రయంలో కోల్డ్‌ స్టోరేజీలు అందుబాటులో ఉన్నాయి. కార్గో టెర్మినల్‌ ద్వారా -20 డిగ్రీల సెంటీగ్రేడ్‌ నుంచి +25 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతల్లో ఉత్పత్తుల తరలించేలా యంత్రాలు సిద్ధం చేశారు. వస్తు రవాణా పార్కింగ్‌ ప్రాంతాన్ని కార్గో టెర్మినల్‌ నుంచి కేవలం 50 మీటర్ల దూరంలోనే ఏర్పాటు చేశారు. దీంతో రవాణాకు ఇబ్బంది ఉండదు. *ఉష్ణోగ్రతల్లో మార్పురాకుండా* ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉష్ణోగ్రతలను కొనసాగిస్తూ వస్తు రవాణా కోసం కూల్‌ డాలీ అనే ట్రాలీ యంత్రాన్ని జీహెచ్‌ఏసీ అధికారులు గత సెప్టెంబరులోనే అందుబాటులోకి తీసుకువచ్చారు. మొబైల్‌ రిఫ్రిజిరేషన్‌ యూనిట్‌గా ఇది ఉపయోగడుతుంది.

దీని ద్వారా వ్యాక్సిన్లు, ఇతర ఔషధ ఉత్పత్తుల రవాణా సలువవుతుంది. టెర్మినల్‌ నుంచి కార్గో విమానంలోకి ఎక్కడా ఉష్ణోగ్రతల్లో మార్పు రాకుండా వస్తువులను తరలించేందుకు కూల్‌ డాలీలు ఉపయోగపడతాయి. ఎన్విరోటైనర్‌, సీ-సేఫ్‌, యూనికూలర్‌, వ్యాక్‌టైనర్‌ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

కార్గో సర్వీసులు సైతం పూర్తిగా కాగిత రహితంగా జరగనున్నాయి. ఇ-రిసెప్షన్‌, ఇ-ఓఓసి, ఇ-లియో, లి-ఏడబ్ల్యూబి వంటి ఆధునిక వసతులను కంపెనీ ప్రవేశపెట్టింది. వివిధ కంపెనీల ప్రతినిధులు, నియంత్రణాధికారుల కోసం కార్గో విలేజ్‌లో ప్రత్యేకంగా కార్గో శాటిలైట్‌ భవనం కేటాయించారు.

*అమెరికాలో ప్రత్యేక విమానాల్లో: ఫైజర్‌*

అమెరికాలో ఫైజర్‌ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ రవాణాకు ప్రత్యేక చార్టర్‌ విమానాలను యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ నిర్వహిస్తోంది. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం లభించగానే, ఈ వ్యాక్సిన్‌ను డిసెంబరులో ప్రజలకు అందించాలన్నది ఫైజర్‌ లక్ష్యం. ఫైజర్‌ వ్యాక్సిన్‌ను -70 డిగ్రీల సెల్సియన్‌ ఉష్ణోగ్రతలో రవాణా చేయాల్సి ఉంది. ఇందుకోసం డ్రైఐస్‌ వినియోగించాలని యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ నిర్ణయించింది. సాధారణంగా విమానాల్లో అనుమతించే స్థాయి కంటే అధికంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం డ్రైఐస్‌ తీసుకెళ్లేందుకు ఫెడరల్‌ ఏవియేషన్‌ అథారిటీ నుంచి అనుమతి పొందింది కూడా. డ్రైఐస్‌ నింపిన సూట్‌కేసుల్లో ఫైజర్‌ వ్యాక్సిన్‌ను రవాణా చేయనున్నారు. ఇందువల్ల సులభంగా, త్వరగా చేరవేయగలమని సంస్థ ఆశిస్తోంది. ఈ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి లభించగానే 64 లక్షల డోసులు పంపిణీ చేయాలన్నది ప్రస్తుత లక్ష్యం_ .


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading