*ఆన్‌లైన్‌లోనే పోలీస్ విచారణ* *అందుబాటులోకి ‘ఐ-వెరిఫై’ విధానం* *ప్రారంభించిన డీజీపీ మహేందర్‌రెడ్డి*
హైదరాబాద్: తెలంగాణ పోలీ స్‌శాఖ మరో వినూత్న విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. పోలీస్ విచారణ ప్రక్రియను ఇకపై ఆన్‌లైన్‌లోనే నిర్వహించనుంది. పోలీస్ వెరిఫికేషన్‌తోపాటు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లను ఈ విధానంలోనే జారీ చేయనున్నారు. ఈ మేరకు ‘ఐ-వెరిఫై’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు.
ఈ ప్రక్రియను డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. అదనపు డీజీపీలు జితేందర్, గోవింద్‌సింగ్, బాలానాగాదేవి, ఐజీలు ప్రభాకర్‌రావు, స్టీఫెన్‌రవీంద్ర, నాగిరెడ్డి, రాజేశ్ హాజరయ్యారు. ఎవరెవరు దరఖాస్తు చేయాలంటే..?
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ రంగ సంస్థలు తాము ఎంపిక చేసుకున్న ఉద్యోగుల పూర్వాపరాలు తెలుసుకునేందుకు పోలీస్ విచారణ కోరుతూ దరఖాస్తు చేయొచ్చు.
* ఉన్నత విద్య, ఉపాధి, వ్యాపారం, వలస నిమిత్తం విదేశాలకు వెళ్లేవారు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తుదారులు తెలంగాణ పోలీస్ వెబ్‌సైట్ *https://www.tspolice.gov.in* ను సందర్శించి ‘పోలీస్ వెరిఫికేషన్ అండ్ క్లియరెన్స్’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. అందులోని యూజర్ మాన్యువల్ మార్గదర్శకాలను అనుసరించి సంబంధిత ధ్రువీకరణపత్రాలను అప్‌లోడ్ చేసి రుసుం చెల్లించాలి. దరఖాస్తు అనంతరం విచారణ ప్రక్రియ సర్టిఫికెట్ జారీ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే పూర్తవుతుంది.
ఈ విధానంతో దరఖాస్తుదారులకు చాలా వరకు సమయం ఆదా కానుంది. ఇప్పటివరకు దరఖాస్తుదారులు రుసుం చెల్లించేందుకు బ్యాంకుకు వెళ్లి చలానా కట్టాల్సి వచ్చేది. కొన్ని అధీకృత బ్యాంకుల్లో మాత్రమే ఇందుకు అనుమతి ఉండటంతో దరఖాస్తుదారులు ఇబ్బంది పడేవారు.
* దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసిన వెంటనే ఆ దరఖాస్తు సంబంధిత ఇంటెలిజెన్స్ లేదా స్పెషల్ బ్రాంచ్‌కు యాంత్రికంగానే బదిలీ అయిపోతుంది. దీని వల్ల సమయం ఆదా అవుతుంది.
* నేరచరితుల చిత్రాలు, వివరాల చిట్టా పోలీస్‌శాఖలో అంతర్గతంగా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంటుంది కాబట్టి దరఖాస్తుదారుల పూర్వాపరాల తనిఖీలో భాగంగా నేరచరిత్ర ఏమైనా ఉందా అని సులభంగా తెలుసుకోవచ్చు.
* విచారణ వివరాలను ఎప్పటికప్పుడు దరఖాస్తుదారులకు అప్‌డేట్ చేస్తూ ఉంటారు కాబట్టి దరఖాస్తు ప్రక్రియ ఏ స్థాయిలో ఉందో సులభంగా తెలుసుకోగలుగుతారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.