Teluguwonders:
నాంపల్లిలో BJP Telanganaఆధ్వర్యంలో .. భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశం వేదికపై టీటీడీపీకి చెందిన చాలా మంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే దిశగా నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభలో రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు, నేతలు భారీగా తరలివచ్చారు. కీలక నేతలతో కలిసి తెలుగు తమ్ముళ్లు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
🔴గరికపాటి మోహన్ రావు నేతృత్వంలో :
టీటీడీపీ నేతలు సామ రంగారెడ్డి, ఎర్ర శేఖర్, శోభా రాణి, రజినీ కుమారీ తదితర నేతలు గరికపాటి మోహన్ రావు నేతృత్వంలో బీజేపీలో చేరారు.
💥వివరాల్లోకి వెళ్తే :
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆదివారం (ఆగస్టు 18) బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన భావేద్వేగంగా మాట్లాడారు.
తెలంగాణ తెలుగు దేశం పార్టీ నేతల కళ్లు తెరిపిస్తామని ఎంపీ గరికపాటి మోహన్ రావు శపథం పూనారు. నలుగురైదురు నేతలు కలిసి తెలుగు తమ్ముళ్లను నిలువునా ముంచారని.. 30 ఏళ్లుగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు. పార్టీ కోసం రాత్రింబవళ్లు ఎంతో కష్టపడ్డా.. తీరని అన్యాయం జరగడంతో తల్లి లాంటి పార్టీని వీడాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. మనసు చంపుకొని బీజేపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.
💥న్యాయం చేస్తాం:
‘మీ కళ్లు తెరిపిస్తాం.. మీరు చేసిన అన్యాయానికి ఈ తమ్ముళ్లు, చెల్లెమ్మలకు బీజేపీలో న్యాయం చేస్తాం’ అంటూ టీటీడీపీ నేతలను ఉద్దేశించి గరికపాటి వ్యాఖ్యలు చేశారు. గోల్కొండ కోట మీద, తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పారు.
‘భారత సైన్యం ఎంత గొప్పదో.. బీజేపీలోకి వచ్చిన ఈ సైన్యం అంత గొప్పది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇక్కడకు వచ్చారు. మనల్ని ఎవ్వరూ ఆపలేరు. భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని పల్లె పల్లెకు పోదాం’ అని గరికపాటి పిలుపునిచ్చారు.
🔴23 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ పిలుపుతో :
‘37 ఏళ్లు టీడీపీలో ఉండి బీజేపీలో చేరడానికి వచ్చాం. బాధతోనే ఆ పార్టీని వీడుతున్నాం. 23 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ పిలుపుతో నాతో పాటు చాలా మంది నేతలం టీడీపీలో చేరాం. నాకు తెలిసి ఒకరిద్దరు మినహా ప్రస్తుతం ఆ నేతలెవరూ టీడీపీలో లేరు. పరిస్థితి ఇంతలా దిగజారడానికి కారణం కొంత మంది నేతలే..’ అని చెబుతూ గరికపాటి కంటతడి పెట్టుకున్నారు.
👉బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో పలువురు నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి, బీజేపీ నేతలు ఇంద్రసేనా రెడ్డి, జితేందర్ రెడ్డి, డీకే అరుణ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జేపీ నడ్డాను నేతలంతా గజమాలతో సన్మానించారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.