44 % విద్యార్థులకు ఆన్‌లైన్ విద్య తెలియదు

*44 % విద్యార్థులకు ఆన్‌లైన్ విద్య తెలియదు* *కరోనాకు ముందు పాఠశాలల విద్యార్థుల పరిస్థితి ఇదీ* *గుటెన్‌బర్గ్, ఎవల్డిజైన్ అధ్యయనం వెల్లడి* ఈనాడు – హైదరాబాద్: కొద్ది నెలలుగా ఆన్‌లైన్ విద్యపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్నా కరోనాకు ముందు 44 శాతం మంది పాఠశాలల విద్యార్థులు ఆన్‌లైన్ చదువు జోలికి పోలేదు.ఉన్నత విద్య అభ్యసిస్తున్న 24 శాతం విద్యార్థులదీ అదే పరిస్థితి. అమెరికా, భారత్ తదితర దేశాల్లో డిజిటల్ కార్యకలాపాలను అందిస్తున్న గుటెన్‌బర్గ్ సంస్థ విద్యాపరిశోధనపై పనిచేస్తున్న ఎవల్డిజైన్ అనే సంస్థతో కలిసి కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులు విద్య కోసం ఎదుర్కొంటున్న సవాళ్లు, చదువుపై ప్రభావం తదితర అంశాలపై సర్వే చేసింది. మొత్తం 31 దేశాలకు చెందిన 250 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నిఫుణులతో మాట్లాడి నివేదికను విడుదల చేసింది. *చదువులో నైపుణ్యాన్ని చేర్చాలి* కరోనా వల్ల విద్యపై తీవ్ర ప్రభావం చూపిందని, చదువులో నైపుణ్యాలను చేర్చి ఇప్పుడున్న సందిగ్ధ పరిస్థితుల్లో విద్యార్థులను సిద్ధం చేయాలని నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఎవల్డిజైన్ సీఈఓ ఆకాంక్ష బప్పా మాట్లాడుతూ యునెస్కో అంచనాల ప్రకారం కరోనా కారణంగా ప్రపంచంలో 70 శాతం విద్యార్థుల చదువుపై ప్రభావం పడిందని, ఆన్‌లైన్ విద్యకు అలవాటు పడటానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. విద్యార్థుల ప్రతిభను కొలిచే కొలమానాలపై పునరాలోచన చేయాలని వారు సూచించారు. ఆన్‌లైన్ విద్యకు కావాల్సిన మౌలిక వసతులు లేకపోవడం, అరకొరగా ఉండటం వల్ల అభ్యసనం తగ్గిపోతుందని, ఇళ్లలో ఉండటం వల్ల గృహ హింస పెరుగుతుందని, అది విద్య నేర్చుకునే సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన చెందారు. కరోనా పరిస్థితుల్లో చిన్న పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని, దానివల్ల విద్య అందుబాటులో లేకపోవడమనే సమస్య పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. *సర్వేలో మరికొన్ని ముఖ్యాంశాలు* * ఆన్‌లైన్‌లో విస్తృతంగా సమాచారం అందుబాటులో ఉన్నా నెట్‌వర్క్ సమస్యలు ప్రధాన ఆటంకంగా మారాయి. * విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకున్న వారిలో ఎక్కువ మంది ఒక ఏడాది వాయిదా వేసుకున్నారు. ఆర్థిక రంగం కుప్పకూలడం వల్ల ఉద్యోగాల కొరత ఉండవచ్చని వారు ఆందోళన చెందుతున్నారు. * కరోనా వల్ల పిల్లలతో గడిపే సమయం అధికమైందని తల్లిదండ్రులు తెలిపారు. ఆన్‌లైన్ విద్య కారణంగా వారిని నిత్యం పర్యవేక్షించాల్సి రావడం సమస్యగా ఉందని అభిప్రాయపడ్డారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
