*యాప్‌ డెవలపర్ల కోసం రూ.10 కోట్ల పెట్టుబడి

0

*యాప్‌ డెవలపర్ల కోసం రూ.10 కోట్ల పెట్టుబడి*

*మినీ యాప్‌ స్టోరులో పది లక్షల యాప్‌లు: పేటీఎం* 

హైదరాబాద్‌: భారతీయ యాప్‌ డెవలపర్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చే లక్ష్యంతోనే ఆండ్రాయిడ్‌ మినీ యాప్‌ స్టోరును ప్రారంభించినట్లు పేటీఎం తెలిపింది. తన యాప్‌స్టోరు పనితీరు గురించి వివరించేందుకు గురువారం ఏర్పాటు చేసిన దృశ్యమాధ్యమ సమావేశంలో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ మాట్లాడుతూ.. భారతీయ యాప్‌ డెవలపర్లు ఎక్కువగా గూగుల్‌పై ఆధారపడటంతో..

ఆ సంస్థ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోందన్నారు. ఆర్థిక లావాదేవీలు జరిగినప్పుడు 30శాతం కమీషన్‌ ఇవ్వాలంటూ ‘టోల్‌ కలెక్టర్‌’గా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

గూగుల్‌ ఈ రుసుమును వసూలు చేసే గడవు తేదీ లోపు 10లక్షలకు పైగా యాప్‌లను తమ మినీ యాప్‌ స్టోర్‌ కిందకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. రూ.10 కోట్ల పెట్టుబడిని యాప్‌ల కోసం అందుబాటులో ఉంచుతున్నామన్నారు.

ఇప్పటికే డెకాథ్లాన్‌, డోమినోస్‌ పిజ్జా, ఫ్రెష్‌మెనూ, నెట్‌మెడ్స్‌, నోబ్రోకర్‌, ఓలావంటి 300 యాప్‌లు ఇందులో భాగస్వామ్యం అయ్యాయని వివరించారు. సెప్టెంబరు 18న తమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ..

పేటీఎంతో సహా మరో 18 యాప్‌లను గూగుల్‌ నిలిపివేసింది. అక్కడి నుంచి భారతీయ ప్లే స్టోర్‌ ఉండాలనే నినాదాన్ని యాప్‌ డెవలపర్లు వినిపిస్తున్నారు. ఇందులో భాగంగానే పేటీఎం ఆండ్రాయిడ్‌ మినీ యాప్‌ స్టోర్‌ను ప్రారంభించింది.

దీన్ని వినియోగించుకునేందుకు డెవలపర్లు ఎలాంటి ఫీజు చెల్లించక్కర్లేదు. యాప్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకునే అవసరం లేకుండానే మినీ యాప్‌ స్టోరు నుంచి మొబైల్‌ వెబ్‌సైటుగా వాడుకునే వీలును ఇది కల్పిస్తుంది.

Leave a Reply