విద్యార్థులకు అలర్ట్.. అలా చేస్తే వీసా కట్..! ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..

trump-5

విదేశీ విద్యార్థులకు వీసాలంటేనే చిర్రెత్తిపోతున్నారు ట్రంప్‌. రోజుకో రీతిలో ఆ వీసాలకు ఎసరు పెట్టేందుకు ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక మార్గాల్లో విదేశీ విద్యార్థుల సంఖ్యకు కోత పెట్టేందుకు చర్యలు చేపట్టిన ట్రంప్‌..ఇప్పుడు వర్సిటీల్లో 15 శాతం పరిమితిని విధిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు సోషల్‌మీడియాలో క్లీన్‌చిట్‌ ఉంటేనే అమెరికాకు ఎంట్రీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించింది యూఎస్ ప్రభుత్వం.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోతే వీసా కట్.. క్లాస్‌లకు బంక్‌ కొడితే వీసా కట్‌.. సోషల్‌ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్‌ పెడితే వీసా కట్‌.. ఇలా అమెరికాలో విదేశీ విద్యార్థులను తగ్గించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. ఇతర దేశాల నుంచి చదువు కోసం వస్తున్న విద్యార్థులు అమెరికాలో సమస్యలు సృష్టిస్తున్నారన్న ట్రంప్‌..హార్వర్డ్ యూనివర్సిటీతో పాటు ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో విదేశీ విద్యార్థులపై 15 శాతం పరిమితి విధిస్తామని స్పష్టం చేశారు. విదేశీ విద్యార్థులు కారణంగా స్థానిక అమెరికన్ విద్యార్థులు మెరుగైన విద్యను పొందలేకపోతున్నారని మండిపడ్డారు. దేశ వ్యతిరేక భావజాలానికి కొన్ని వర్సిటీలు కేంద్రంగా మారుతున్నాయని ఆరోపించారు. అందుకోసమే విద్యార్థుల వీసాలపై పరిమితి విధిస్తామని స్పష్టం చేశారు. అమెరికాలోని కొన్ని యూనివర్సిటీల ఆవరణల్లో ఇటీవల పాలస్తీనాకు మద్దతుగా పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ట్రంప్‌ సర్కారు విదేశీ విద్యార్థులపై ఆగ్రహంగా ఉంది. ఈ క్రమంలోనే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.

అమెరికాలో ప్రస్తుతం 11 లక్షలకు పైగా విదేశీ విద్యార్థులు..

అమెరికాలో ప్రస్తుతం 11 లక్షలకు పైగా విదేశీ విద్యార్థులు ఉన్నారు. వీరిలో 3 లక్షల మంది భారతీయ విద్యార్థులే. ట్రంప్‌ తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో ఇప్పటికే అక్కడ ఉన్న విద్యార్థులతో పాటు అమెరికాలో చదవాలని ప్రణాళికలు వేసుకుంటున్న విద్యార్థులకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. అమెరికాలో చదువు కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను ఇప్పటికే తాత్కాలికంగా నిలిపివేసింది అమెరికా ప్రభుత్వం. దాంతో పాటు సోషల్ మీడియా వెట్టింగ్‌ను తెరపైకి తెచ్చింది. అమెరికాలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సోషల్‌ మీడియా ప్రొఫైళ్లను క్షుణంగా పరిశీలిస్తారు. ఆ తర్వాతే వారికి వీసా మంజూరు చేస్తారు. అప్పటివరకు విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను నిలిపివేశారు. ఉగ్రవాదులను నియంత్రించడం, యూదు వ్యతిరేకతను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ తనిఖీ చేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది.

భారత విద్యార్థులతో అమెరికాకు 43.8 బిలియన్‌ డాలర్ల ఆదాయం..

‘సోషల్‌ మీడియా వెట్టింగ్‌’ విదేశీ విద్యార్థుల వీసా ప్రక్రియపై పెను ప్రభావం చూపనుంది. దీంతో అమెరికా యూనివర్సిటీలపై ఆర్థికంగానూ భారం పడనుంది. 2024లో 2.7 లక్షలకు పైగా నమోదైన భారత విద్యార్థులతో అమెరికా ఆర్థికవ్యవస్థకు 43.8 బిలియన్‌ డాలర్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ట్రంప్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఈ ఆదాయానికి భారీగా కోతపడుతుందని వర్సిటీలు ఆందోళన చెందుతున్నాయి.మరోవైపు ఇటీవల హార్వర్డ్‌ యూనివర్సిటీకి అందించే నిధుల్లో ట్రంప్ ప్రభుత్వం కోత విధించింది. ఆ తర్వాత ఏకంగా విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ట్రంప్‌ చర్య అనైతికమని నిబంధనలు ఉల్లంఘించడం అవుతుందని హార్వర్డ్‌ పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి.. ట్రంప్‌ నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights