తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రతి జిల్లాకు రూ.కోటి విడుదల

ponguleti-review-meeting
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రతి జిల్లాకు రూ.కోటి విడుదల
తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా ప్రతి జిల్లాకు రూ. 1 కోటి చొప్పున సహాయక చర్యల కోసం నిధులు విడుదల చేసింది. వాతావరణ శాఖ రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో, అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
మంత్రి పొంగులేటి సమీక్ష
భారీ వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా ప్రతి జిల్లాకు రూ. 1 కోటి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం చెరువులు, నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. వరదల కారణంగా అనేక చోట్ల రహదారి మార్గాలు దెబ్బతిన్నాయి.
ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సీఎస్ కె. రామకృష్ణరావుతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. మంత్రి, ఆయా జిల్లాల్లోని పరిస్థితులపై కలెక్టర్లను ప్రశ్నించి వివరాలు సేకరించారు.
ప్రధాన ఆదేశాలు
ముంపు, లోతట్టు ప్రాంతాల్లో తక్షణ రక్షణ మరియు సహాయక చర్యలు చేపట్టాలి.
అన్ని జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, మున్సిపల్ విభాగాలు సమన్వయంతో పని చేయాలి.
అధికారుల సెలవులు రద్దు చేసి, అందరూ విధుల్లో అందుబాటులో ఉండాలి.
మంత్రి పొంగులేటి, వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని, ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన సూచనలు చేశారు.
