Viral Video: వీధి కుక్కల బెడదపై నాటకం ప్రదర్శన.. స్టేజ్‌పైకి నిజంగానే వచ్చి ఆర్టిస్టును కరచిన కుక్క! వీడియో

వీధి కుక్కల బెడదపై జనాలకు అవగాహన కల్పించాలని ఓ వ్యక్తి తమ ఊరిలో వీధి నాటకాన్ని ప్రదర్శించారు. ఇంతలో అక్కడికి నిజంగా వచ్చిన ఓ కుక్క తన అసలు పాత్రను పోషించి.. నాటకం ఆర్టిస్ట్‌ని కరిచి పరారైంది. ఇందుకు సంబంధించిన వీడియో..
తిరువనంతపురం, అక్టోబర్ 7: దేశంలో చాలా చోట్ల వీధి కుక్కల బెడదతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఓ వ్యక్తి జనాలకు అవగాహన కల్పించాలని తమ ఊరిలో వీధి నాటకాన్ని ప్రదర్శించారు. ఇంతలో అక్కడికి నిజంగా వచ్చిన ఓ కుక్క తన అసలు పాత్రను పోషించి.. నాటకం ఆర్టిస్ట్‌ని కరిచి పరారైంది. ఈ విచిత్ర ఘటన కేరళలోని కన్నూరులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
కేరళలోని కన్నూర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం కందన్‌కైలోని పీ కృష్ణప్పిల్ల లైబ్రరీలో వీధి కుక్కల బెడదపై పెక్కోలం అనే పేరుతో నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకంలో ఆర్టిస్ట్ రాధాకృష్ణన్ ఏకపాత్రాభినయం చేశాడు. నాటకంలో భాగంగా ఓ కుక్క అతడి వెంటపడుతున్నట్లు, దాని బారి నుంచి తప్పించుకుని పరుగెత్తుతూ చేతిలోని కర్రతో దాన్ని తరుముతున్నట్లుగా అతడు నటించాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగానీ ఓ నల్లని వీధి కుక్క అక్కడ ప్రత్యక్షమైంది. అంతే స్టేజ్‌పై జరుగుతున్న నాటకంలోకి రంగ ప్రవేశం చేసి, కుక్కను తరుముతున్నట్లు నటిస్తున్న ఆర్టిస్టుపై నిజంగానే దాడి చేసి, కరిచింది. వీధి కుక్క కరవడంతో కూతుర్ని కోల్పోయిన తండ్రి పాత్ర చేస్తున్న రాధాకృష్ణన్ కాలును కరిచి గట్టిగా మొరుగుతూ అక్కడే ఉండిపోయింది. అయితే కుక్క దాడిచేసినప్పటికీ రాధాకృష్ణన్ మాత్రం కుక్కల దాడిలో తన కూతురిని కోల్పోయిన తండ్రి పాత్రను పోషిస్తూనే నాటకం కొనసాగించడం విశేషం.
ఇంతలో ప్రేక్షకుల్లో ఓ వ్యక్తి ఆ కుక్క వద్దకు వెళ్లి, తన చెప్పుతో దానిని అక్కడి నుంచి తరిమాడు. అనంతరం కుక్క దాడితో గాయమైన రాధాకృష్ణన్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా ఇటీవలి కాలంలో కేరళలో వీధికుక్కల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంది. వాటిని సామూహికంగా చంపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో విస్తృతంగా అవగాహన ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. వీధి కుక్కల దాడుల గురించి అవగాహన పెంచే నాటకంలో ఆర్టిస్ట్‌ను నిజంగానే వీధి కుక్క కరవడం ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
