February 26, 2026

ఇకపై వాట్సాప్‌ ద్వారా చెల్లింపులు

IMG-20201106-WA0016.jpg

*ఇకపై వాట్సాప్‌ ద్వారా చెల్లింపులు*

దిల్లీ: వాట్సాప్‌ వినియోగదారులకు శుభ వార్త. ఇకపై ఈ మెసేజింగ్‌ యాప్‌ నుంచి డబ్బులు పంపుకోవడం, పేమెంట్స్‌ వంటివి చేసుకోవచ్చు. వాట్సాప్‌లో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దశల వారీగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చుకోవచ్చని నేషనల్‌ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) గురువారం వెల్లడించింది. కాగా..

కేంద్రం అనుమతులపై ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం నుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జుకర్‌ వీడియో సందేశం ద్వారా ప్రకటించారు. 

*ఎలాంటి ఛార్జీలు లేవు: జుకర్‌* ‘యూపీఐ(యునైటెడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌)తో భారత్‌ ప్రత్యేకత సాధించింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. ఇలాంటి ఘనత సాధించిన తొలి దేశం భారతే. ఇందులో మేము కూడా భాగస్వాములు కావడం.. డిజిటల్‌ ఇండియాకు మా వంతు సహకారం అందించే అవకాశం రావడం ఆనందంగా ఉంది’ అని జుకర్‌బర్గ్‌ తెలిపారు. _వాట్సాప్‌‌ ద్వారా డబ్బు పంపించడం.._ సందేశాలు పంపించినంత సులభమని జుకర్‌ అన్నారు. వాట్సాప్‌ చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయట్లేదని, 140కి పైగా బ్యాంకు ఖాతాల నుంచి పేమెంట్స్‌ జరుపుకోవచ్చని వెల్లడించారు. చెల్లింపులకు మరింత భద్రత కల్పించేలా త్వరలోనే వాట్సాప్‌ యూపీఐని తీసుకురానున్నట్లు జుకర్‌ చెప్పారు. పది ప్రాంతీయ భాషల్లో ఈ వాట్సాప్‌ పేమెంట్స్‌ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. 

*వాట్సాప్‌ పే.. ఇప్పుడే అందరికీ కాదు* భారత్‌లో వాట్సాప్‌ పేమెంట్స్‌ సేవలు నేటి నుంచి అందుబాటులోకి వస్తున్నప్పటికీ యూజర్లందరికీ చెల్లింపులు చేసుకునే అవకాశం ఉండదు. దశల వారీగా ఈ సేవలను అందుబాటులోకి తేవాలని ఎన్‌పీసీఐ వెల్లడించింది. తొలుత 2 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్లతో మాత్రమే ఈ సేవలను ప్రారంభించాలని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. మార్కెట్‌ విస్తృతికి ఉన్న అవకాశాల దృష్ట్యా భారత్‌లో వాట్సాప్‌ పేమెంట్స్‌ అనుమతి కోసం ఆ సంస్థ గత రెండు సంవత్సరాలుగా ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు నేడు అనుమతులు లభించాయి. 


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading