మెట్రో దిగగానే బస్సు రెడీ.. హైదరాబాద్‌లో కొత్త సర్వీసులు…

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది TSRTC. మెట్రో స్టేషన్ల వద్ద మినీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి ప్రయాణికుల కష్టాలను తగ్గించాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఈ బస్సులు త్వరలోనే రోడ్లపైకి రానున్నాయి.
ప్రస్తుతం మెట్రో స్టేషన్ల వద్ద బస్టాప్‌లు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రయాణికులు చాలా దూరం నడవాల్సి వస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది మెట్రో దిగిన తర్వాత ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని మెట్రోకు ఫీడర్ సర్వీసులుగా మినీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.
ఈ బస్సులు మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలు, ప్రధాన ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్తాయి. దీంతో “లాస్ట్ మైల్ కనెక్టివిటీ” సమస్యకు పరిష్కారం లభించనుంది. నగరంలో ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఈ కొత్త సర్వీసులు మెట్రో ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి.
ఇంకా, ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఎల్బీనగర్, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి, ఉప్పల్, మెహిదీపట్నం, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో ఈ ఛార్జింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ స్టేషన్లలో ఉన్న హైపవర్ ఛార్జర్లు కేవలం 10 నిమిషాల్లోనే బస్సులను పాక్షికంగా ఛార్జ్ చేయగలవు.
ఈ వ్యవస్థ ద్వారా బస్సులు ఎక్కువ ట్రిప్పులు చేయగలుగుతాయి. అలాగే డిపోకు వెళ్లి ఎక్కువ సమయం ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం తగ్గుతుంది. దీంతో విద్యుత్ వినియోగంపై కూడా ఒత్తిడి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
చార్జింగ్ స్టేషన్ల కోసం 1500 నుంచి 2500 చదరపు మీటర్ల భూమి అవసరమని అంచనా వేస్తున్నారు. ఈ భూమి సేకరణ ప్రక్రియ కూడా త్వరలో పూర్తి చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
