*అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటన* గ్రీన్‌కార్డులపై నిషేధం ఎత్తివేత
వాషింగ్టన్: భారత దేశ ఐటీ నిపుణులకు శుభవార్త. గ్రీన్‌కార్డుల జారీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. కరోనా దృష్ట్యా స్వదేశీయులు ఉద్యోగాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో గత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటిపై నిషేధం విధించగా, దాన్ని రద్దు చేశారు.
దీంతో విదేశీ నిపుణులు, ముఖ్యంగా భారతీయులకు ప్రయోజనం కలగనుంది. వీరంతా హెచ్-1బీ వీసాలపైన అమెరికా వచ్చి ఉద్యోగాలు చేస్తుంటారు. గ్రీన్‌కార్డునే అధికారిక వ్యవహారాల్లో శాశ్వత నివాస ధ్రువపత్రంగా వ్యవహరిస్తారు. ఈ వీసాలపై ట్రంప్ అంక్షలు పెట్టడం వల్ల అమెరికాకు నష్టం జరిగిందని బైడెన్ వ్యాఖ్యానించారు. అయితే కొన్ని వృత్తుల వారికి కొత్తగా తాత్కాలిక వర్క్ వీసాలు, హెచ్-1బీ వీసాలు మంజూరు చేయకుండా గత ఏడాది జూన్‌లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం మార్చలేదు. ఈ నిర్ణయాన్ని నవీకరించకపోతే మార్చి 31న దానంతట అదే రద్దయిపోతుంది.
ప్రస్తుతం అమెరికాలో 4,73,000 గ్రీన్‌కార్డు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రంప్ విధించిన ఆంక్షల కారణంగా మరో 1.20లక్షల మంది దరఖాస్తు చేయడానికే అవకాశంలేకపోయింది. దాంతో వారికుటుంబసభ్యులూ ఇబ్బందులు పడ్డారు.